Sunday, June 28, 2009

నా మొదటి అనువాదం - టెడ్ ఉపన్యాసాలు

టెడ్ ఉపన్యాసాలు - నలుగురికి తెలియాల్సిన ఆలోచనలు
ఒక్క వాక్యం టెడ్ ఉపన్యాసాలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టంగా చెపుతుంది. మధ్యే తమ ఉపన్యాసాలను ఇతర భాషల్లోకి మార్చే ప్రయత్నం టెడ్ మొదలు పెట్టింది. ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. అందుకే 'ఆరో ఇంద్రియం' అనే ఉపన్యాసాన్ని అనువాదం చేయడానికి నేను ముందుకు వచ్చాను.

మీకు గనక టెడ్ గురించి తెలియకపోతే, ఇప్పుడే వెంటనే చూడండి. ఉపన్యాసంతో మొదలుపెట్టండి. 'ఆరో ఇంద్రియం'. మీకు గనక నచ్చితే, ఉపన్యాసాలు అనువాదించడానికి మీరు ముందుకు రండి. (కాని మీకు ముందే ఒక విషయం చెప్పాలి, తెలుగు వాక్యాలు సరిగ్గా చూపగలిగే వీడియో ప్లేయర్ నేను ఇప్పటి వరుకు చూడలేదు)

అనువాదానికి కావలిసినవి ఏమిటి అని ఆలోచిస్తే, నాకు ఇవి నెట్లో దొరికాయి.
  • తెలుగు - ఆంగ్లం నిగంటువు - ఇది చూసి మీరు నవ్వుతున్నారు అనుకుంటా. కాని ఆంగ్లంలోని కొన్ని పదాలకు తెలుగులో అవే అర్థంగల పదాలు నాకు వెంటనే తట్టవు. అందుకే ఇది వాడుతుంటాను.
  • గూగుల్ బుక్మార్క్లేట్ - ఇది చాలా అవసరం. దీన్ని అన్ని చోట్లా వాడచ్చు. మీరు తెలుగు పదాలను ఆంగ్లంలో వ్రాస్తే, వాటిని తెలుగులోకి మారుస్తుంది.
  • డాట్ సబ్ - ఇది మొత్తం అనువాదం ఒకే సారి చేయాల్సిన అవసరం లేకుండా ఒక వాక్యం తరువాత ఒక వాక్యాన్ని చేయడానికి సహకరిస్తుంది.
  • అన్నిటి కంటే ముఖ్యంగా నా స్నేహితులు ఉన్నారు. ఎక్కడైనా ఆగిపోతే సహకరిస్తూ ఉంటారు.
మొత్తానికి ఒక రోజు ఈమెయిలు రానే వచ్చింది. మీరు అనువాదాన్ని ఒక నెల రోజుల్లో చెయ్యాలి. తరువాత మీరు చేసిన దాన్ని మరొకరు చూసి బాగుంటే వెబ్సైటులో పెడతాము అని చెప్పారు. ఎనిమిది నిమిషాల ఉపన్యాసానికి నెల రోజులు ఎందుకు అని అనుకున్నాను.

చాలా ఉత్సాహంతో అనువాదాన్ని మొదలుపెట్టాను. కానీ రెండు వాక్యాలు రాసానో లేదో, తరువాత వాక్యాన్ని తెలుగులో ఎలా రాయాలో నాకు అర్థం కాలేదు. ఇలా ఎన్నో చోట్లా ఆగిపోయాను. ఉదాహరణకు వాక్యాన్ని తీసుకోండి,
'TED is the best networking place of this year'
దీన్ని తెలుగులో ఎలా వ్రాయగలను? ఏటి గొప్ప కలుసుకునే చోటు టెడ్. వాక్యం చదివితే నాకే నవ్వు వస్తుంది. మిగతావాళ్ళు ఏమి అనుకుంటారు? తెలుగులో కన్నా ఆంగ్లంలో చదవడమే మేలు అనుకోరు?
పోనీ అలా కాకుండా, నెట్వర్కింగ్ అనే వదిలేస్తే ఎలా ఉంటాది అని కూడా ఆలోచించాను.

మొత్తానికి నెల రోజులు ఇలాంటివి దాటి అనువాదాన్ని పూర్తి చేశాను. మీరు చదవాలి అనుకుంటే, ఇక్కడ దొరుకుతుంది. కాని నేను ఇంతక ముందు చెప్పినట్టు ఇంకొకలు ఇది చదివి బాగుంది అంటేనే టెడ్ వెబ్సైటులో పెట్టబడుతుంది. కాని తెలుగులోకి అనువాదించడానికి ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. బ్లాగ్ని తెలుగులో రాసి జల్లెడలో పెట్టడానికి కూడా ఇది ఒక కారణం.

దీన్ని ద్వారా నాకు తెల్సింది ఏమిటి అంటే, ఆంగ్లంలో నుంచి తెలుగులోకి అనువాదించడానికి రెండు భాషలు వస్తే సరిపోదు. ఎందుకంటే కొన్ని ఆంగ్ల పదాలను తెలుగులోకి సులువుగా మార్చలేము. వంద సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్లో ఇంకా సి.పి.బ్రౌన్ గారు వ్రాసిన నిఘంటువు మాత్రమే దొరుకుతుందంటే అర్థం చేసుకోవచ్చు.

వికీపీడియా,వికిషనరీ మొదలగునవి తెలుగులో కూడా ఏర్పరచడానికి కృషి చేస్తున్న వాళ్ళకి ఇవి ఏవి అడ్డంకులు కాకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అదే విధముగా తెలుగులో కూడా బ్లాగులు రాసేవాళ్ళు ఉంటారని జల్లెడ ద్వారా మాత్రమే నాకు తెలిసింది. నిజంగా మిమ్మల్ని మనసారా మెచ్చుకోవచ్చు.

మీకు ఇవి ఎందుకు అడ్డంకులు కాలేదో నాకు అనువాదం చేశాకనే అర్థం అయింది. తెలుగులో వ్రాస్తుంటే అనుభూతే వేరు. తెలుగు పదాలలో మమకారం, ఆప్యాయత ఉట్టిపడుతున్నాయి. మీరు కూడా ఇది ఆస్వాదించాలంటే, తప్పకుండా వికీపీడియాలోని రచ్చబండ భాగానికి వెళ్లి చదవండి. అంతెందుకు ఒక తెలుగు బ్లాగ్ని చదివి చూడండి.