Sunday, December 20, 2009

నా మొదటి పుస్తకం - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇ లు - ఉపోద్ఘాతం

ప్రతి దానికి ఆరంభం అనేది ఉంటాది. ఒక రోజు దీపావళి గురించి చదువుతున్నప్పుడు ఇది నా కంట పడింది.
"నరక చతుర్దశి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం చతుర్దశి నాడు జరుపుకుంటారు. దీపావళి మరునాడు జరుపుకుంటారు.”
ఆశ్వయుజ మాసం ? కృష్ణ పక్షం ? చతుర్దశి ?
ఎక్కడో వినట్టు ఉన్నాయి కాని వాటి అర్థం నాకు తెలియదు. తెలుగు వాడిని నాకే తెలుగు కేలండర్ అర్థం కాకపోవడం ఏంటి అని ఆ రోజు బాధపడ్డాను. తెలుగు కేలండర్ గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష అప్పుడే పుట్టింది. కాని అనుకున్నంత సులభం కాదు కదా.

అంతర్జాలంలో వెతకడం మొదలు పెట్టాను. చాలా వెబ్సైటులు కంటపడ్డాయి. కాని అవి ( అన్ని కావు ) ఆలోచింపజేసాలా లేవు. ఉదాహరణకు,
"తిథి అంటే సూర్యుడుకి చంద్రుడుకి మధ్య దూరం పన్నెండు డిగ్రీలు పెరగడానికి పట్టే సమయం. ప్రతి చంద్ర మాసంలో ముప్పై తిథులు ఉంటాయి. అని ప్రథమ, ద్వితీయ, తృతీయ ........."
ఇది చదవగానే నాకు చాలా సందేహాలు వచ్చాయి.
అసలు సూర్యుడు చంద్రుడు ఎక్కడ ఉంటే మనకేంటి?
వాటి మధ్య దూరం 60° ఉంటే ఏంటి 72° ఉంటే ఏంటి?
అసలు కాలాన్ని తెలియజేయడానికి తిథులే ఎందుకు వాడాలి?
ఇంకేమైనా ఎందుకు వాడలేదు?
ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి, వాటికి నా ఆలోచనలను జోడించి, ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటాది అని అనుకున్నాను. చాలా మటుకు అందరికి తెలిసినవే. వాటిని ఒక కొత్త దృక్పధంతో చూడటమే నేను చేస్తున్నది.

ముందుగా పుస్తకం మొత్తం పూర్తి అయ్యాక బ్లాగులో పెడితే బాగుంటాది అని అనుకున్నాను. కాని అది పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆసక్తి కోల్పోతున్నాను. ఆందుకనే నేర్చుకుంటూ వ్రాస్తే ( పాఠశాలలో నోట్సు వ్రాసినట్టు) బాగుంటాది అని భావించాను. కాని ఇలా చేసినప్పుడు చాలా తప్పులు దొర్లే అవకాశం ఉందని గ్రహించాలి.

దీనికి తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇ లు అని పేరు పెట్టడానికి కారణం?
ఈ పుస్తకం తెలుగు కేలండర్కి సంభందించి అన్ని విషయాలు తెలియజేయటానికి ప్రయత్నించటం లేదు. అందుకనే పేరులో ఈ నుంచి ఱ వరుకు అక్షరాలను వదిలేసాను :)

ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకునేది ఏంటి ?
కాలాన్ని తెలియజేయడానికి మనం తిథి, నక్షత్రం మొదలగునవి ఉపయోగిస్తున్నాము. వీటిని అర్థం చేసుకోవడానికి కావలిసిన ఖగోల శాస్త్ర సంగతులు మొదటగా తెలుసుకుందాం. తరువాత కాలాన్ని కొలిచేందుకు వాడే కొలామానానికి కావలిసిన లక్షణాలు ఏమిటో చూద్దాము. ఈ విధముగా తిథి, నక్షత్రం మొదలగునవి అసలు ఎందుకు అంత ప్రాచుర్యంలోకి వచ్చాయో మనం తెలుసుకోగలుగుతాము. చిట్టచివరగా తెలుగు కేలండరు యొక్క కొలమానాలు గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాము.

అందరికి తెలిసినవి ఒక కొత్త శైలిలో తెలియజేయడానికి నేను చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. కాబట్టి ఎమైనా తప్పులు ఉంటే చదువరులు తెలియజేయగలరు.

ఈ స్పూర్తి పుస్తకం పూర్తి అయ్యేవరుకు ఉంటాదని ఆశిస్తూ మరి ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతానికి ముగింపు పలుకుతున్నాను.

౧.౧ - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు
౧.౨ - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు
౨.౧ – తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు
౨.౨ – తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు