Friday, March 19, 2010

నా మొదటి పుస్తకం – తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు - ౨.౨

వృత్తాకార కక్ష్య – Circular Orbit
పోటు వేళ – High Tide
పాటు వేళ – Low Tide
౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯, ౦ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0

రాశికి, నక్షత్రానికి తేడా ఏమిటి?
భూమి సూర్యుడు చుట్టూ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. ఈ కక్ష్య వెంబడి నక్షత్రాలను ౧౨ గుంపులుగా విభజించారు. అవే రాశులు. భూమి నుంచి చూసినప్పుడు సూర్యుడు ఏ నక్షత్ర గుంపు దగ్గర ఉంటాడో అదే రాశి.
భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఒక సంవత్సరం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశి దగ్గరకు వెళ్ళడానికి పట్టే సమయం ఒక నెల. దీన్నే సూర్యమాసం అని అంటారు.[౧]
రాశులు - మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ..

చంద్రుడు భూమి చుట్టూ ఒక సారి తిరగడానికి సుమారుగా నెల రోజులు పడుతుంది. దీన్నే చంద్ర మాసం అని అంటారు. అంటే చంద్రుడు రాశి చక్రం అంతా తిరగడానికి ఒక నెల చాలు. కాని చంద్రుడు కదలికను రాశిని ఉపయోగించి చెప్పటం లేదు. నక్షత్రాన్ని ఉపయోగించి చెబుతున్నారు. ఇలా ౨౭ నక్షత్రాలను గుర్తించారు. అవే అశ్విణి, భరణి, కృత్తిక, ..
ఉదాహరణకు మేషం నక్షత్ర గుంపులో అశ్విణి, భరణి, కృత్తిక మొదటి పాదం ఉంటాయి.
తెలుగు కేలండర్లో వాడేది చంద్ర మాసం. ప్రతి చంద్ర మాసం శుక్ల పక్ష పాడ్యమితో మొదలై కృష్ణ పక్ష అమావాస్యతో ముగుస్తుంది. ఒక సంవత్సరంలో సుమారుగా ౧౨ చంద్ర మాసాలు ఉంటాయి. అవే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం, ..
ప్రతి చంద్ర మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర ఉంటాడో ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. ఉదాహరణకు పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటే అది చైత్ర మాసం.[౨]

ఇవాళ అమావాస్య అని అనుకుందాం. ఒక సంవతరంలో సుమారుగా ౧౨ చంద్ర మాసాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. అంటే ౧౨ సార్లు అమావాస్య వస్తుంది. అమావాస్య నాడు చంద్రుడు భూమి, సూర్యుడు మధ్య ఉంటాది అని తెలుసుకదా.
అంటే అమావాస్య అని తెలిస్తే చంద్రుడు, భూమి ఈ ౧౨లో ఒక చోట ఉంటాయని చెప్పొచ్చు.
మరి ఈ ౧౨లో ఏది అనేది ఎలా తెలుసుకోవడం?
ఏ మాసమో తెలిస్తే సరిపోతుంది.
ఆగండి, ఏ నక్షత్రమో తెలిసినా సరిపోతుంది. అది ఎలాగా?
సరిగ్గా గమనిస్తే ఈ ౧౨లో ప్రతి సారి చంద్రుడు వేరు వేరు నక్షత్రాల దగ్గర ఉన్నాడు.
ఆగండి, ఆగండి, ఏ రాశి తెలిసినా సరిపోతుంది. అది ఎలాగా?
ఈ ౧౨లో ప్రతి సారి సూర్యుడు వేరు వేరు రాశుల దగ్గర ఉన్నాడు!

మొత్తానికి మనం గమనించాల్సినది ఏమిటి అంటే
తిథి ( కరణం ), నక్షత్రం, మాసం, రాశి అనేవి సూర్యుడు, చంద్రుడు భూమి నుంచి చూస్తే ఏ నక్షత్రం దగ్గర ఉన్నాయో చెబుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే సముద్రపు పాటు వేళలు, పోటు వేళలు, ఋతువులు తెలుసుకోవచ్చు. ( ఋతువులు ఆరు – వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు.[౩] )
కాబట్టే ఇవి అంత వ్యాప్తిలోకి వచ్చాయి. అందుకనే ఇప్పుడు వీటిని అంత తొందరగా మరిచిపోతున్నాం. ఏమి చేయగలం?

మరి సంవత్సరం, యుగం, మహా యుగం, మన్వంతరం, కల్పం దేనికి?

సంప్రదించిన మూలాలు

Wednesday, March 17, 2010

నా మొదటి పుస్తకం – తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు - ౨.౧

అండాకార కక్ష్య – Elliptical Orbit
అక్షం - Axis
పోటుపాట్లు - Tides
గురుత్వాకర్షణ శక్తి - Gravitational Force

వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి, సూర్యుడు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే ఉపయోగకరం అని తెలుసుకున్నాం.
సముద్రంలో చేపలు పట్టే వాళ్ళకి భూమి, చంద్రుడు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే ఉపయోగకరం అని తెలుసుకున్నాం.

అదే విధంగా,
ఋతువులు అనేవి భూమి సూర్యుడు చుట్టూ అండాకార కక్ష్యలో తిరగడం వల్ల కాదు అని, భూమి యొక్క అక్షం వాలుగా ఉండడం వల్ల అని తెలుసుకున్నాం. అంటే భూమి యొక్క అక్షం వాలుగా ఉండనట్టయితే ఋతువులు అనేవే ఉండేవి కాదు!
సముద్రపు పోటుపాట్లు చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల కాదు అని, రెండు ప్రదేశాల మధ్య చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తిలో ఉన్న తేడా వల్ల అని కూడా తెలుసుకున్నాం.

ఇది అంతా గమనిస్తుంటే,
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు ఇతర గ్రహాలు మన జీవితాల్ని శాసిస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకునే జ్యోతిష్య శాస్త్రం ఏర్పడి ఉంటాది!

మొదట్లో సమయం యొక్క కొలమానాలకి ఈ లక్షణాలు ఉండాలి అనుకున్నాము.
  • అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండాలి.
  • గడియారం యొక్క అవసరం రాకూడదు. 
  • ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి.
అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు ఇతర గ్రహాలు అనేవి ఎక్కడ ఉన్నాయో కొలమానాలు చెప్పగలిగితే చాలు. అవి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆకాశం వైపు చూస్తే చాలు సమయం చెప్పగలం!
మరి తెలుగు కేలండర్ యొక్క కొలమానాలు ఈ విధంగా ఉన్నాయా?
మన కొలమానాలు గమనిస్తే ముఖ్యమైనవి. ( చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఇవి మాత్రమే నేను విన్నాను! )
తిథి ( కరణం ), నక్షత్రం, పక్షం, మాసం, రాశి, ఋతువు, ఉత్తరాయణం/దక్షిణాయణం, సంవత్సరం, యుగం ( పాదం ), మహా యుగం, మన్వంతరం, కల్పం.

ముందుగా తిథి ( కరణం ), నక్షత్రం, పక్షం, మాసం, రాశి, ఋతువు, ఉత్తరాయణం/దక్షిణాయణం గురించి తెలుసుకుందాం.
మొదటగా తిథులు గురించి తెలుసుకోవాలంటే నాగమురళిగారు వ్రాసిన తిథులు అంటే ఏమిటి? అన్న బ్లాగును చదవండి.
తిథి, నక్షత్రం గురించి వేమూరి రావుగారు వ్రాసిన పంచాంగాలు, కేలండర్లు అన్న బ్లాగుని చదవండి.

౨.౨ – తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు

Monday, March 15, 2010

నా మొదటి పుస్తకం - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు - ౧.౨

పోటు వేళ – High Tide
పాటు వేళ – Low Tide
చంద్ర భూ పరిభ్రమణం - Revolution of Moon around Earth
చంద్రుడి కళలు - Moon's Phases
గురుత్వాకర్షణ శక్తి - Gravitational Force
నిలువు మరియు అడ్డ భాగాలు - Vertical and Horizontal Components
౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯, ౦ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0

వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి, సూర్యుడు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే ఉపయోగకరం అని తెలుసుకున్నాం.
మరి సముద్రంలో చేపలు పట్టేవాళ్ళకి ఏమి కావాలి?
సముద్రంలోకి ఎప్పుడు బయలుదేరాలి?
అంటే సముద్రం ఏ సమయంలో ఎలా ఉంటాదో తెలియాలి. సముద్రపు పోటు వేళలు, పాటు వేళలు తెలియాలి.
ఇవి దేని మీద ఆధారపడతాయి?
చంద్ర భూ పరిభ్రమణం మీద. అంటే చంద్రుడి కళల మీద.

పౌర్ణమి నాడు సముద్రపు పోటుపాట్లు పెద్దవిగా ఉంటాయని మనం వినే ఉంటాం. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటాది అని అనుకున్నాను. కాని అమావాస్య నాడు కూడా సముద్రపు పోటుపాట్లు పెద్దవిగా ఉంటాయి. 
ఇది ఎలా సాధ్యం?
పైగా చంద్రుడు నిండుగా ఉండటానికి ఆకర్షణ శక్తికి సంబంధం లేదు కదా. ఆకర్షణ శక్తి భూమి, చంద్రుడు మధ్య దూరం మీద ఆధారపడతాది. పౌర్ణమి నాడు చంద్రుడు ఏమైనా భుమికి దగ్గరగా వస్తాడా?[౧]
చంద్రదూరస్థానం - 4,05,700 కిలోమీటర్లు
చంద్రసమీపస్థానం - 3,67,100 కిలోమీటర్లు
పెద్దగా తేడా ఏమి లేదు.
పైగా చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తే కారణం అయితే, చంద్రుడు కన్నా భూమి మీద సూర్యుడు యొక్క ఆకర్షణ శక్తే ఎక్కువ. (అందుకే మనం సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాము. చంద్రుడు చుట్టూ తిరగటం లేదు!)అప్పుడు సముద్రపు పోటుపాట్లకి కారణం సూర్యుడు కదా. చంద్రుడు ఎలా అవుతాడు?

అప్పుడు తెలిసింది ఆకర్షణ శక్తి కాదు, రెండు ప్రదేశాల మధ్య చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తిలో ఉన్న తేడా అసలు కారణం అని.
అసలు సముద్రపు పోటుపాట్లు అంటే ఏమిటో ఇది చూసాకా అర్థం అయింది!
అప్పటి వరకు సముద్రపు అలల్ని పోటుపాట్లతో పొరబడేవాడిని.
వీటికి కారణం ఏమిటో చూద్దామా.
గురుత్వాకర్షణ శక్తి దూరంతో తగ్గుతుంది అని మనకు తెలుసు. పైన చూపించినట్టు చంద్రుడు, భూమి ఉన్నాయి అనుకుంటే, చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి B మీద కన్నా A మీద ఎక్కువగా ఉంటాది అని చెప్పవచ్చు. దీని వల్ల ఏమి జరుగుతాది?

మూడు కార్లు రహదారి మీద వెళ్ళుతున్నాయి అని అనుకుందాము. అవే B, భూమి, A అనుకుందాము. B గంటకి 30 కిలోమీటర్ల వేగంతో, భూమి 40 కిలోమీటర్ల వేగంతో, A 50 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాయి.
ఇప్పుడు ఏమి అవుతాది?
Aకి భూమికి మధ్య దూరం పెరుగుతూ ఉంటాది.
Bకి భుమికి మధ్య దూరం కూడా పెరుగుతూ ఉంటాది.
A, B అనేవి భూమిలో భాగం అనుకుంటే, ఇప్పుడు అవి భూమికి దూరంగా వెళ్ళిపోతున్నాయి అనుకోవచ్చు కదా.
ఈ విధంగా A, B దగ్గర భూమి పొంగటాన్నే సముద్రపు పోట్లు అంటారు. అదే విధముగా C, D దగ్గర సముద్రపు పాట్లు వస్తాయి.
భూమి తన చుట్టూ తాను ఒక సారి తిరుగడాన్నే రోజు అంటాము. కాబట్టి భూమి మీద ఏ ప్రదేశమైనా రోజుకు ఒక సారి A దగ్గరకి, ఒక సారి B దగ్గరకి, ఒక సారి C దగ్గరకి, ఒక సారి D దగ్గరకి వస్తాయి. కాబట్టే సముద్రంలో రోజుకు రెండు సార్లు పాటుపోట్లు వస్తాయి.

మరి అమావాస్య నాడు, పౌర్ణమి నాడు సముద్రపు పోటుపాట్లు పెద్దవిగా ఎందుకు ఉంటాయి?
ఎందుకంటే ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే వరుసలో ఉంటాయి కనుక. ఆ రోజు చంద్రాకర్షణ శక్తి తేడా వల్ల కలిగే పోటు, సూర్యాకర్షణ శక్తి తేడా వల్ల కలిగే పోటు కలిసి పెద్దవిగా ఏర్పడతాయి.

మరి సముద్రపు పోటుపాట్లకి కారణం చంద్రుడు అని ఎందుకు అంటారు? సూర్యుడు ఎందుకు కాదు?
నిజానికి వాటికి కారణం చంద్రుడు 80% అయితే, సూర్యుడు 20%.
అదేంటి భూమి మీద సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువ అని ఇందాకే అనుకున్నాము కదా.
గణిత శాస్త్రం ద్వారా చెప్పాలంటే,
F∝1/d2 అయినా, dF∝1/d3.
ఈ ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకోవచ్చు.
టార్చ్ లైటు తీసుకుని, వెలుతురు లేని గదిలో, ఒక గోడ మీద దాని యొక్క వెలుతురుని కేంద్రీకరించండి. ఇప్పుడు వెలుతురుని కేంద్రీకరించిన ప్రదేశానికి, దానికి కొంచెం దూరంలో ఉన్న ప్రదేశానికి వెలుతురులో ఎంత తేడా ఉందో గమనించండి.
అవే రెండు చోట్ల సూర్యుడి వల్ల వెలుతురులో ఎంత తేడా ఉందో గమనించండి.
టార్చ వల్ల వెలుతురులో ఎక్కువ తేడాని గమనించవచ్చు.
అంటే సూర్యుడి వల్ల ఆ రెండు చోట్ల ఎక్కువ కాంతి వచ్చినా, టార్చ్ ఆ రెండు చోట్లకి దగ్గరగా ఉండడం వల్ల వెలుతురులో ఎక్కువ తేడాని కలిగించింది.
అదే విధంగా, భూమి మీద సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువైనా, చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల రెండు ప్రదేశాల మధ్య చంద్రుడు యొక్క ఆకర్షణ శక్తిలో ఎక్కువ తేడా ఉంటాది![౨]
ఇప్పుడు ఇది చూడండి.

సంప్రదించిన మూలాలు

Sunday, March 14, 2010

నా మొదటి పుస్తకం - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు - ౧.౧

చంద్రుడి కళలు - Moon's Phases
భూ సూర్య పరిభ్రమణం - Revolution of Earth around Sun
అండాకార కక్ష్య – Elliptical Orbit
అక్షం - Axis
గోళార్థం - Hemi-sphere
దృవం - Pole
ఆర్కటిక్ వృత్తం - Arctic Circle
ఉత్తరదక్షిణాయన రేఖ – Tropic of Cancer
భూమధ్య రేఖ – Equator
దక్షిణఉత్తరాయణరేఖ – Tropic of Capricorn
సూర్యదూరస్థానం - Aphelion
సూర్యసమీపస్థానం - Perihelion
౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯, ౦ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0

శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశత్ మహాయుగే, కలి యుగే, ప్రథమ పాదే, విరోధినామ సంవత్సరే, ఉత్తరాయణే, వసంత ఋతౌ, ఫాల్గుణ మాసే, కృష్ణ పక్షే, చతుర్థశి, ( నక్షత్రం ), ( యోగం ), ( కరణం ).[౧]
ప్రతి పూజ యొక్క సంకల్పంలో ఆది నుండి వర్తమానం వరకు గడిచిన కాలమానాన్ని ప్రస్తావిస్తూ ఉంటాము.
దీన్ని అర్థం చేసుకోవడమే నేను చేస్తున్న ప్రయత్నం.

అసలు సెకండ్లు, నిముషాలు, గంటలు, రోజులు ఇవి ఏవి లేవు అని అనుకుందాము.
ఇప్పుడు సమయం ఎలా చెబుతాము?
సమయం యొక్క కొలమానాలు మనమే నిర్ణయించాల్సి వస్తే ఏమి వాడేవాళ్ళం?
వాటికి కావలిసిన లక్షణాలు ఏమిటి?
  • అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండాలి.
  • గడియారం యొక్క అవసరం రాకూడదు. 
  • ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి.  

గడియారాలు లేనప్పుడు, సమయం ఎలా తెలుసుకునేవారు?
'ఒరేయి! సాయంత్రం కల్లా పని పూర్తి చేయి.'
  • సూర్యుడు ఉదయించే సమయం, అస్తమించే సమయం ఉపయోగిస్తున్నాము. 
'వర్షాలు పడుతున్నాయి. నాట్లు మొదలుపెట్టాలి.'
'వేసవి కాలంలో ఎండలు మండి పోయినవి రా బాబు.'
  • సూర్యుడి యొక్క ఉత్తరాయణం, దక్షిణాయణం ఉపయోగిస్తున్నాము. 
'వచ్చే పౌర్ణమి హోలీ పండుగ. సందడి సందడిగా ఉంటాది.'
  • చంద్రుడి కళలు ఉపయోగిస్తున్నాము. 

అసలు సూర్యుడుకి చంద్రుడుకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాము?
ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి.
అప్పుడు ప్రజలు దేని మీద ఎక్కువ ఆధారపడేవారు? ( ఇప్పుడు కూడా అవే అనుకోండి! )
వ్యవసాయం ( ఇది సూటిగా చెప్పగలను ) మరియు చేపలను పట్టడం ( ఇది వాదించదగ్గ విషయం ).
వ్యవసాయానికి ముఖ్యముగా ఏమి కావాలి?
వర్షాలు ఎప్పుడు పడతాయి? నాట్లు ఎప్పుడు మొదలుపెట్టాలి?
అంటే వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియాలి.
ఇది దేని మీద ఆధారపడతాది?
భూ సూర్య పరిభ్రమణం మీద.
నిజానికి, ఈ మధ్య దాకా నాకు ఈ విషయం తెలీదు. భూమి సూర్యుడు చుట్టూ అండాకార కక్ష్యలో తిరుతుంది కదా. కాబట్టి భూమి సూర్యుడుకి దగ్గరగా ఉన్నప్పుడు వేసవి కాలం, దూరంగా ఉన్నప్పుడు చలి కాలం అనుకున్నాను. కాని తరువాత తెలిసింది - భారతదేశంలో వేసవి కాలం అయితే, ఆస్ట్రేలియాలో చలి కాలం అని.
ఇది ఎలా సాధ్యం?
భూమి సూర్యుడికి దగ్గరగా ఉండడమే కారణం అయితే అందరికి వేసవి కాలం అయి ఉండాలి. అప్పుడు తెలుసుకున్నాను అసలు కారణం - భూమి అక్షం నిలువుగా ఉండకుండా వాలుగా ఉంటాది.


పైన చుపించిన బొమ్మలో దక్షిణ గోళార్థంలో పగలు రాత్రి కన్నా ఎక్కువ సేపు ఉంటాది. సూర్య కిరణాలు కూడా నిలువుగా పడతాయి. అందువలన దక్షిణ గోళార్థం వేడిగా ఉంటాది. ఉదాహరణకు దక్షిణ దృవం చూడండి. ఎప్పుడూ వెలుగు ఉంటుంది. రాత్రి అనేదే ఉండదు. ఉత్తర గోళార్థంలో ఇందుకు భిన్నంగా ఉంటాది. పగలు రాత్రి కన్నా తక్కువ సేపు ఉండడమే కాకుండా, సూర్య కిరణాలు వాలుగా పడుతుంటాయి. కాబట్టి అక్కడ చలి కాలం.


మొత్తానికి భూమి సూర్యుడు చుట్టూ అండాకారంలో తిరుగుతుంది అని నేను అనుకున్నది కూడా తప్పు అని తేలింది.
సూర్యదూరస్థానం - 1.52*108కిలోమీటర్లు
సూర్యసమీపస్థానం - 1.47*108కిలోమీటర్లు
కాబట్టి భూమి సూర్యుడు చుట్టూ సుమారుగా వృత్తాకారంలో తిరుగుతుంది అని చెప్పవచ్చు.[౨]

సంప్రదించిన మూలాలు

వాడిన బొమ్మలు

Sunday, December 20, 2009

నా మొదటి పుస్తకం - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇ లు - ఉపోద్ఘాతం

ప్రతి దానికి ఆరంభం అనేది ఉంటాది. ఒక రోజు దీపావళి గురించి చదువుతున్నప్పుడు ఇది నా కంట పడింది.
"నరక చతుర్దశి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం చతుర్దశి నాడు జరుపుకుంటారు. దీపావళి మరునాడు జరుపుకుంటారు.”
ఆశ్వయుజ మాసం ? కృష్ణ పక్షం ? చతుర్దశి ?
ఎక్కడో వినట్టు ఉన్నాయి కాని వాటి అర్థం నాకు తెలియదు. తెలుగు వాడిని నాకే తెలుగు కేలండర్ అర్థం కాకపోవడం ఏంటి అని ఆ రోజు బాధపడ్డాను. తెలుగు కేలండర్ గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష అప్పుడే పుట్టింది. కాని అనుకున్నంత సులభం కాదు కదా.

అంతర్జాలంలో వెతకడం మొదలు పెట్టాను. చాలా వెబ్సైటులు కంటపడ్డాయి. కాని అవి ( అన్ని కావు ) ఆలోచింపజేసాలా లేవు. ఉదాహరణకు,
"తిథి అంటే సూర్యుడుకి చంద్రుడుకి మధ్య దూరం పన్నెండు డిగ్రీలు పెరగడానికి పట్టే సమయం. ప్రతి చంద్ర మాసంలో ముప్పై తిథులు ఉంటాయి. అని ప్రథమ, ద్వితీయ, తృతీయ ........."
ఇది చదవగానే నాకు చాలా సందేహాలు వచ్చాయి.
అసలు సూర్యుడు చంద్రుడు ఎక్కడ ఉంటే మనకేంటి?
వాటి మధ్య దూరం 60° ఉంటే ఏంటి 72° ఉంటే ఏంటి?
అసలు కాలాన్ని తెలియజేయడానికి తిథులే ఎందుకు వాడాలి?
ఇంకేమైనా ఎందుకు వాడలేదు?
ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి, వాటికి నా ఆలోచనలను జోడించి, ఒక పుస్తకం వ్రాస్తే బాగుంటాది అని అనుకున్నాను. చాలా మటుకు అందరికి తెలిసినవే. వాటిని ఒక కొత్త దృక్పధంతో చూడటమే నేను చేస్తున్నది.

ముందుగా పుస్తకం మొత్తం పూర్తి అయ్యాక బ్లాగులో పెడితే బాగుంటాది అని అనుకున్నాను. కాని అది పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆసక్తి కోల్పోతున్నాను. ఆందుకనే నేర్చుకుంటూ వ్రాస్తే ( పాఠశాలలో నోట్సు వ్రాసినట్టు) బాగుంటాది అని భావించాను. కాని ఇలా చేసినప్పుడు చాలా తప్పులు దొర్లే అవకాశం ఉందని గ్రహించాలి.

దీనికి తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇ లు అని పేరు పెట్టడానికి కారణం?
ఈ పుస్తకం తెలుగు కేలండర్కి సంభందించి అన్ని విషయాలు తెలియజేయటానికి ప్రయత్నించటం లేదు. అందుకనే పేరులో ఈ నుంచి ఱ వరుకు అక్షరాలను వదిలేసాను :)

ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకునేది ఏంటి ?
కాలాన్ని తెలియజేయడానికి మనం తిథి, నక్షత్రం మొదలగునవి ఉపయోగిస్తున్నాము. వీటిని అర్థం చేసుకోవడానికి కావలిసిన ఖగోల శాస్త్ర సంగతులు మొదటగా తెలుసుకుందాం. తరువాత కాలాన్ని కొలిచేందుకు వాడే కొలామానానికి కావలిసిన లక్షణాలు ఏమిటో చూద్దాము. ఈ విధముగా తిథి, నక్షత్రం మొదలగునవి అసలు ఎందుకు అంత ప్రాచుర్యంలోకి వచ్చాయో మనం తెలుసుకోగలుగుతాము. చిట్టచివరగా తెలుగు కేలండరు యొక్క కొలమానాలు గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాము.

అందరికి తెలిసినవి ఒక కొత్త శైలిలో తెలియజేయడానికి నేను చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. కాబట్టి ఎమైనా తప్పులు ఉంటే చదువరులు తెలియజేయగలరు.

ఈ స్పూర్తి పుస్తకం పూర్తి అయ్యేవరుకు ఉంటాదని ఆశిస్తూ మరి ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతానికి ముగింపు పలుకుతున్నాను.

౧.౧ - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు
౧.౨ - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు
౨.౧ – తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు
౨.౨ – తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు

Sunday, June 28, 2009

నా మొదటి అనువాదం - టెడ్ ఉపన్యాసాలు

టెడ్ ఉపన్యాసాలు - నలుగురికి తెలియాల్సిన ఆలోచనలు
ఒక్క వాక్యం టెడ్ ఉపన్యాసాలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టంగా చెపుతుంది. మధ్యే తమ ఉపన్యాసాలను ఇతర భాషల్లోకి మార్చే ప్రయత్నం టెడ్ మొదలు పెట్టింది. ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. అందుకే 'ఆరో ఇంద్రియం' అనే ఉపన్యాసాన్ని అనువాదం చేయడానికి నేను ముందుకు వచ్చాను.

మీకు గనక టెడ్ గురించి తెలియకపోతే, ఇప్పుడే వెంటనే చూడండి. ఉపన్యాసంతో మొదలుపెట్టండి. 'ఆరో ఇంద్రియం'. మీకు గనక నచ్చితే, ఉపన్యాసాలు అనువాదించడానికి మీరు ముందుకు రండి. (కాని మీకు ముందే ఒక విషయం చెప్పాలి, తెలుగు వాక్యాలు సరిగ్గా చూపగలిగే వీడియో ప్లేయర్ నేను ఇప్పటి వరుకు చూడలేదు)

అనువాదానికి కావలిసినవి ఏమిటి అని ఆలోచిస్తే, నాకు ఇవి నెట్లో దొరికాయి.
  • తెలుగు - ఆంగ్లం నిగంటువు - ఇది చూసి మీరు నవ్వుతున్నారు అనుకుంటా. కాని ఆంగ్లంలోని కొన్ని పదాలకు తెలుగులో అవే అర్థంగల పదాలు నాకు వెంటనే తట్టవు. అందుకే ఇది వాడుతుంటాను.
  • గూగుల్ బుక్మార్క్లేట్ - ఇది చాలా అవసరం. దీన్ని అన్ని చోట్లా వాడచ్చు. మీరు తెలుగు పదాలను ఆంగ్లంలో వ్రాస్తే, వాటిని తెలుగులోకి మారుస్తుంది.
  • డాట్ సబ్ - ఇది మొత్తం అనువాదం ఒకే సారి చేయాల్సిన అవసరం లేకుండా ఒక వాక్యం తరువాత ఒక వాక్యాన్ని చేయడానికి సహకరిస్తుంది.
  • అన్నిటి కంటే ముఖ్యంగా నా స్నేహితులు ఉన్నారు. ఎక్కడైనా ఆగిపోతే సహకరిస్తూ ఉంటారు.
మొత్తానికి ఒక రోజు ఈమెయిలు రానే వచ్చింది. మీరు అనువాదాన్ని ఒక నెల రోజుల్లో చెయ్యాలి. తరువాత మీరు చేసిన దాన్ని మరొకరు చూసి బాగుంటే వెబ్సైటులో పెడతాము అని చెప్పారు. ఎనిమిది నిమిషాల ఉపన్యాసానికి నెల రోజులు ఎందుకు అని అనుకున్నాను.

చాలా ఉత్సాహంతో అనువాదాన్ని మొదలుపెట్టాను. కానీ రెండు వాక్యాలు రాసానో లేదో, తరువాత వాక్యాన్ని తెలుగులో ఎలా రాయాలో నాకు అర్థం కాలేదు. ఇలా ఎన్నో చోట్లా ఆగిపోయాను. ఉదాహరణకు వాక్యాన్ని తీసుకోండి,
'TED is the best networking place of this year'
దీన్ని తెలుగులో ఎలా వ్రాయగలను? ఏటి గొప్ప కలుసుకునే చోటు టెడ్. వాక్యం చదివితే నాకే నవ్వు వస్తుంది. మిగతావాళ్ళు ఏమి అనుకుంటారు? తెలుగులో కన్నా ఆంగ్లంలో చదవడమే మేలు అనుకోరు?
పోనీ అలా కాకుండా, నెట్వర్కింగ్ అనే వదిలేస్తే ఎలా ఉంటాది అని కూడా ఆలోచించాను.

మొత్తానికి నెల రోజులు ఇలాంటివి దాటి అనువాదాన్ని పూర్తి చేశాను. మీరు చదవాలి అనుకుంటే, ఇక్కడ దొరుకుతుంది. కాని నేను ఇంతక ముందు చెప్పినట్టు ఇంకొకలు ఇది చదివి బాగుంది అంటేనే టెడ్ వెబ్సైటులో పెట్టబడుతుంది. కాని తెలుగులోకి అనువాదించడానికి ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. బ్లాగ్ని తెలుగులో రాసి జల్లెడలో పెట్టడానికి కూడా ఇది ఒక కారణం.

దీన్ని ద్వారా నాకు తెల్సింది ఏమిటి అంటే, ఆంగ్లంలో నుంచి తెలుగులోకి అనువాదించడానికి రెండు భాషలు వస్తే సరిపోదు. ఎందుకంటే కొన్ని ఆంగ్ల పదాలను తెలుగులోకి సులువుగా మార్చలేము. వంద సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్లో ఇంకా సి.పి.బ్రౌన్ గారు వ్రాసిన నిఘంటువు మాత్రమే దొరుకుతుందంటే అర్థం చేసుకోవచ్చు.

వికీపీడియా,వికిషనరీ మొదలగునవి తెలుగులో కూడా ఏర్పరచడానికి కృషి చేస్తున్న వాళ్ళకి ఇవి ఏవి అడ్డంకులు కాకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అదే విధముగా తెలుగులో కూడా బ్లాగులు రాసేవాళ్ళు ఉంటారని జల్లెడ ద్వారా మాత్రమే నాకు తెలిసింది. నిజంగా మిమ్మల్ని మనసారా మెచ్చుకోవచ్చు.

మీకు ఇవి ఎందుకు అడ్డంకులు కాలేదో నాకు అనువాదం చేశాకనే అర్థం అయింది. తెలుగులో వ్రాస్తుంటే అనుభూతే వేరు. తెలుగు పదాలలో మమకారం, ఆప్యాయత ఉట్టిపడుతున్నాయి. మీరు కూడా ఇది ఆస్వాదించాలంటే, తప్పకుండా వికీపీడియాలోని రచ్చబండ భాగానికి వెళ్లి చదవండి. అంతెందుకు ఒక తెలుగు బ్లాగ్ని చదివి చూడండి.