Monday, March 15, 2010

నా మొదటి పుస్తకం - తెలుగు కేలండర్ యొక్క అ,ఆ,ఇలు - ౧.౨

పోటు వేళ – High Tide
పాటు వేళ – Low Tide
చంద్ర భూ పరిభ్రమణం - Revolution of Moon around Earth
చంద్రుడి కళలు - Moon's Phases
గురుత్వాకర్షణ శక్తి - Gravitational Force
నిలువు మరియు అడ్డ భాగాలు - Vertical and Horizontal Components
౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯, ౦ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0

వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి, సూర్యుడు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే ఉపయోగకరం అని తెలుసుకున్నాం.
మరి సముద్రంలో చేపలు పట్టేవాళ్ళకి ఏమి కావాలి?
సముద్రంలోకి ఎప్పుడు బయలుదేరాలి?
అంటే సముద్రం ఏ సమయంలో ఎలా ఉంటాదో తెలియాలి. సముద్రపు పోటు వేళలు, పాటు వేళలు తెలియాలి.
ఇవి దేని మీద ఆధారపడతాయి?
చంద్ర భూ పరిభ్రమణం మీద. అంటే చంద్రుడి కళల మీద.

పౌర్ణమి నాడు సముద్రపు పోటుపాట్లు పెద్దవిగా ఉంటాయని మనం వినే ఉంటాం. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటాది అని అనుకున్నాను. కాని అమావాస్య నాడు కూడా సముద్రపు పోటుపాట్లు పెద్దవిగా ఉంటాయి. 
ఇది ఎలా సాధ్యం?
పైగా చంద్రుడు నిండుగా ఉండటానికి ఆకర్షణ శక్తికి సంబంధం లేదు కదా. ఆకర్షణ శక్తి భూమి, చంద్రుడు మధ్య దూరం మీద ఆధారపడతాది. పౌర్ణమి నాడు చంద్రుడు ఏమైనా భుమికి దగ్గరగా వస్తాడా?[౧]
చంద్రదూరస్థానం - 4,05,700 కిలోమీటర్లు
చంద్రసమీపస్థానం - 3,67,100 కిలోమీటర్లు
పెద్దగా తేడా ఏమి లేదు.
పైగా చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తే కారణం అయితే, చంద్రుడు కన్నా భూమి మీద సూర్యుడు యొక్క ఆకర్షణ శక్తే ఎక్కువ. (అందుకే మనం సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాము. చంద్రుడు చుట్టూ తిరగటం లేదు!)అప్పుడు సముద్రపు పోటుపాట్లకి కారణం సూర్యుడు కదా. చంద్రుడు ఎలా అవుతాడు?

అప్పుడు తెలిసింది ఆకర్షణ శక్తి కాదు, రెండు ప్రదేశాల మధ్య చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తిలో ఉన్న తేడా అసలు కారణం అని.
అసలు సముద్రపు పోటుపాట్లు అంటే ఏమిటో ఇది చూసాకా అర్థం అయింది!
అప్పటి వరకు సముద్రపు అలల్ని పోటుపాట్లతో పొరబడేవాడిని.
వీటికి కారణం ఏమిటో చూద్దామా.
గురుత్వాకర్షణ శక్తి దూరంతో తగ్గుతుంది అని మనకు తెలుసు. పైన చూపించినట్టు చంద్రుడు, భూమి ఉన్నాయి అనుకుంటే, చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి B మీద కన్నా A మీద ఎక్కువగా ఉంటాది అని చెప్పవచ్చు. దీని వల్ల ఏమి జరుగుతాది?

మూడు కార్లు రహదారి మీద వెళ్ళుతున్నాయి అని అనుకుందాము. అవే B, భూమి, A అనుకుందాము. B గంటకి 30 కిలోమీటర్ల వేగంతో, భూమి 40 కిలోమీటర్ల వేగంతో, A 50 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాయి.
ఇప్పుడు ఏమి అవుతాది?
Aకి భూమికి మధ్య దూరం పెరుగుతూ ఉంటాది.
Bకి భుమికి మధ్య దూరం కూడా పెరుగుతూ ఉంటాది.
A, B అనేవి భూమిలో భాగం అనుకుంటే, ఇప్పుడు అవి భూమికి దూరంగా వెళ్ళిపోతున్నాయి అనుకోవచ్చు కదా.
ఈ విధంగా A, B దగ్గర భూమి పొంగటాన్నే సముద్రపు పోట్లు అంటారు. అదే విధముగా C, D దగ్గర సముద్రపు పాట్లు వస్తాయి.
భూమి తన చుట్టూ తాను ఒక సారి తిరుగడాన్నే రోజు అంటాము. కాబట్టి భూమి మీద ఏ ప్రదేశమైనా రోజుకు ఒక సారి A దగ్గరకి, ఒక సారి B దగ్గరకి, ఒక సారి C దగ్గరకి, ఒక సారి D దగ్గరకి వస్తాయి. కాబట్టే సముద్రంలో రోజుకు రెండు సార్లు పాటుపోట్లు వస్తాయి.

మరి అమావాస్య నాడు, పౌర్ణమి నాడు సముద్రపు పోటుపాట్లు పెద్దవిగా ఎందుకు ఉంటాయి?
ఎందుకంటే ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే వరుసలో ఉంటాయి కనుక. ఆ రోజు చంద్రాకర్షణ శక్తి తేడా వల్ల కలిగే పోటు, సూర్యాకర్షణ శక్తి తేడా వల్ల కలిగే పోటు కలిసి పెద్దవిగా ఏర్పడతాయి.

మరి సముద్రపు పోటుపాట్లకి కారణం చంద్రుడు అని ఎందుకు అంటారు? సూర్యుడు ఎందుకు కాదు?
నిజానికి వాటికి కారణం చంద్రుడు 80% అయితే, సూర్యుడు 20%.
అదేంటి భూమి మీద సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువ అని ఇందాకే అనుకున్నాము కదా.
గణిత శాస్త్రం ద్వారా చెప్పాలంటే,
F∝1/d2 అయినా, dF∝1/d3.
ఈ ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకోవచ్చు.
టార్చ్ లైటు తీసుకుని, వెలుతురు లేని గదిలో, ఒక గోడ మీద దాని యొక్క వెలుతురుని కేంద్రీకరించండి. ఇప్పుడు వెలుతురుని కేంద్రీకరించిన ప్రదేశానికి, దానికి కొంచెం దూరంలో ఉన్న ప్రదేశానికి వెలుతురులో ఎంత తేడా ఉందో గమనించండి.
అవే రెండు చోట్ల సూర్యుడి వల్ల వెలుతురులో ఎంత తేడా ఉందో గమనించండి.
టార్చ వల్ల వెలుతురులో ఎక్కువ తేడాని గమనించవచ్చు.
అంటే సూర్యుడి వల్ల ఆ రెండు చోట్ల ఎక్కువ కాంతి వచ్చినా, టార్చ్ ఆ రెండు చోట్లకి దగ్గరగా ఉండడం వల్ల వెలుతురులో ఎక్కువ తేడాని కలిగించింది.
అదే విధంగా, భూమి మీద సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువైనా, చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల రెండు ప్రదేశాల మధ్య చంద్రుడు యొక్క ఆకర్షణ శక్తిలో ఎక్కువ తేడా ఉంటాది![౨]
ఇప్పుడు ఇది చూడండి.

సంప్రదించిన మూలాలు

No comments:

Post a Comment